డ్రగ్స్ కేసులు.. ప్రభాస్ కు కొత్త తలనొప్పులు

దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ప్రభాస్ కి తిప్పలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్ ప్రభాస్ పేరుని దారుణంగా వాడేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పాన్-ఇండియా హీరో కావడంతో ప్రభాస్ కు ఈ తలనొప్పులు మరింత ఎక్కువయ్యాయి.

ఎక్కడో బెంగళూరులో హీరోయిన్ సంజన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ అంటూ వార్తలిచ్చేస్తున్నారు. లోపలి మేటర్ తో ప్రభాస్ కి సంబంధం ఏమీ లేకపోయినా థంబ్ నెయిల్ లో ప్రభాస్ ఫొటో పడితే ఆ క్రేజే వేరు. అందుకే బుజ్జిగాడు సినిమా స్టిల్ ఒకటి పడేసి.. డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్ అంటూ పెట్టేస్తున్నారు.

ముంబైలో కంగనా రనౌత్ వ్యవహారం కూడా ఇంతే. ప్రభాస్ హీరోయిన్ ఆఫీస్ ని కూల్చివేసిన అధికారులు. అమ్మో.. ప్రభాస్ హీరోయిన్ అంతమాట అనేసిందా అంటూ వార్తలు వండి వారుస్తున్నారు. వరుసగా ఇద్దరు హీరోయిన్లు వార్తల్లోకెక్కడం, వారిద్దరూ గతంలో ప్రభాస్ తో సినిమాలు చేయడంతో బాహుబలికి తిప్పలు తప్పడం లేదు.

డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్..
పోలీసుల అదుపులో ప్రభాస్ హీరోయిన్..
ప్రభాస్ హీరోయిన్ ఆఫీస్ కూల్చేసిన అధికారులు..
ప్రభాస్ హీరోయిన్ కి భారీ భద్రత..
సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్ హీరోయిన్..

ఇటీవల బాగా పాపులర్ అవుతున్న యూట్యూబ్ టైటిల్స్, థంబ్ నెయిల్స్ ఇవి.

ఆదిపురుష్ వార్తలకంటే ఈ డ్రగ్స్ వార్తల్లోనే ప్రభాస్ పేరు బాగా పాపులర్ అయిపోతోంది. ఈ హీరోయిన్లు.. మిగతా వారితో సినిమాలు చేసినా కూడా ఎందుకో ప్రభాస్ ని మాత్రమే యూట్యూబ్ ఛానెల్స్ టార్గెట్ చేశాయి. ఇలా ప్రభాస్ కి ఏమాత్రం సంబంధం లేకపోయినా యూట్యూబ్ లో ఆయన పేరు కొడితే.. వేలాది క్రైమ్ వార్తలు కనపడుతున్నాయి.

లాక్ డౌన్ కాలంలో ప్రభాస్ వరుసగా సినిమాలు ప్రకటించాడు. చెట్లునాటుతూ, అడవుల్ని దత్తత తీసుకోవడం లాంటి కార్యక్రమాలు చేశాడు. ఈ థంబ్ నెయిల్స్ దెబ్బకి యూట్యూబ్ లో ఇలాంటి ప్రధాన వార్తలన్నీ సైడ్ అవుతున్నాయి. ఇలాంటి సెన్సేషనల్ వార్తలు మాత్రమే హైలెట్ అవుతున్నాయి.