శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శేఖర్ సినిమాకు తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ పాల్గొన్నారు. జీవిత దర్శకత్వంలో రూపొందిన శేఖర్ సినిమాలో రాజశేఖర్‌ హీరోగా నటించగా ఆయన పెద్దమ్మాయి శివాని కీలక పాత్రలో నటించింది.

సినిమా లో రాజశేఖర్‌ లుక్ చాలా విభిన్నంగా ఉంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఏజ్‌ ఎక్కువ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు. కొన్ని సన్నివేశాల్లో రెగ్యులర్ లుక్ లోనే రాజశేఖర్ కనిపిస్తాడని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమా తో మళ్లీ రాజశేఖర్‌ ను మునుపటిలా చూస్తామనే నమ్మకం కలుగుతుందని సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న కొందరు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శివాని మరియు శివాత్మికలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర్ ఈ సినిమా తో మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.