బిగ్ బాస్: రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్..! రఫ్పాడేసిన మెగాపవర్ స్టార్

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అయిదో సీజన్ సందడి చేస్తోంది. ప్రతి శని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున ఇచ్చే సర్ ప్రైజులతో షో ఎప్పటికప్పుడు రక్తి కట్టిస్తూనే ఉంటుంది. ఈసారి కూడా నాగార్జున బిగ్ బాస్ షోకు అంతే బూస్టప్ ఇచ్చారు. ఏకంగా 14వ ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను గెస్ట్ గా తీసుకొచ్చి షోకు సూపర్ బూస్టప్ ఇచ్చారు. పైగా.. ఇదే వేదికపై నితిన్, తమన్నా కలిసి నటించిన మ్యాస్ట్రో టీమ్ ను కూడా రప్పించి అదనపు ఆకర్షణ కల్పించారు.

డిస్నీ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌ రామ్ చరణ్ నటించిన యాడ్‌ని ప్లే చేసి చూపించారు నాగార్జున. రామ్ చరణ్‌ని బిగ్ బాస్ స్టేజ్ మీదికి చిరుత సినిమాలోని రచ్చ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. యాడ్ లో షో మ్యాన్ గా అదరగొట్టేశావ్ అని నాగ్ అంటే.. మీ ఫిట్ నెస్ రహస్యం ఏంటి? అని చరణ్ అడిగారు. మీ డాడీకి నాకు ఒకరే ట్రైనర్.. అతనే అర్జున్ అని చెప్పారు నాగార్జున. నాగార్జున గారిని అంకుల్ అనాలా.. సార్ అనాలో తెలియదు కానీ.. నాకు మాత్రం అన్నే.. అని చరణ్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో.. థాంక్యూ తమ్ముడూ అని నాగ్ స్వీట్ హగ్ ఇచ్చేశారు. నువ్వు, మహేష్, ప్రభాస్, తారక్.. ఇలా యంగ్ జనరేషన్ అంతా ఇరగదీసేస్తున్నారని అన్నారు నాగార్జున.

ఇంటి సభ్యులతో మీకో సర్ ప్రైజ్ అంటూ రామ్ చరణ్‌ని స్టేజ్ మీదికి తీసుకొచ్చారు నాగార్జున. అందరూ ఆనందం, ఆశ్చర్యంతో లేచి నిలబడి రామ్ చరణ్ కు వెల్ కమ్ చెప్పారు. నేనొస్తే ఎప్పుడన్నా నిలబడ్డారా..? గుర్తు పెట్టుకుంటాను అని నాగ్ అనడంతో నవ్వులు విరిశాయి. అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడుతూ రామ్ చరణ్ ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. హౌస్‌లో అంతా రియల్ క్యారెక్టర్‌తోనే ఉండి బాగా ఉండండి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు రామ్ చరణ్.

తమ్ముడూ..! ఆర్ ఆర్ ఆర్ ఎలా వస్తుంది? అని రామ్ చరణ్‌‌ని అడగ్గా.. ‘నేను షూటింగ్‌కి వెళ్తున్నా.. డబ్బింగ్‌కి వెళ్తున్నా.. సాంగ్స్ చేస్తున్నా కానీ.. ఎలా వచ్చిందో ఏంటో మాకు రాజమౌళి గారు ఒక్క సీన్ కూడా చూపించడం లేదు’ అని చెప్పారు రామ్ చరణ్. వెంటనే నాగార్జున.. అయ్యో రాజమౌళిగారూ ఇది చాలా దారుణం అండీ.. చెర్రీకి ఎలాగూ చూపించడం లేదు కనీసం నాకైనా చూపించండి అని సరదాగా అన్నారు. తర్వాత.. ఆచార్య సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు నాగార్జున.

హౌస్ లోకి ‘మాస్ట్రో’ టీంను ఆహ్వానించడంతో నితిన్, తమన్నా, నభా నటేశ్ వచ్చారు. సినిమాలో అంధుడిగా నటించిన నితిన్ స్టేజ్ మీదికి కూడా అంధుడిగానే ఎంట్రీ ఇచ్చి నవ్వించాడు. సినిమాలో ఇలా చేసి చాలామందిని మోసం చేశావ్.. ఇక్కడ కూడా అవసరమా? రామ్ చరణ్ అనడంతో నితిన్ తోసహా అందరూ నవ్వుకున్నారు. తరువాత తమన్నా, నితిన్, నభా నటేష్‌ మాట్లాడి డాన్స్ చేసి అలరించారు.