ఆర్ ఆర్ ఆర్: చరణ్, తారక్ పూర్తి.. అజయ్ దేవగన్ బాకీ

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. రౌద్రం రణం రుధిరం అని దీనికి నామకరణం కూడా చేసారు. ఈ చిత్రం కరోనా తాకిడికి ఇబ్బందులకు గురైన విషయం తెల్సిందే. పలు మార్లు షూటింగ్ లు వాయిదా పడి ఎట్టకేలకు చిత్రాన్ని పూర్తి చేసారు. చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవ్వగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ ను జనవరి 7, 2022న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని రిలీజ్ డేట్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చరణ్, తారక్ లు ఆర్ ఆర్ ఆర్ డబ్బింగ్ ను పూర్తి చేసారని వినికిడి. వీరిద్దరూ కేవలం తెలుగులోనే కాక దాదాపు అన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారట.

రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోన్న అలియా భట్ కూడా తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయట. హిందీలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు దేవగన్.