ఆమె మాటలతో ఏకీభవించను.. అందుకు నేను అర్హుడిని కాను: సోనూసూద్

గతేడాది కరోనా సమయంలో వలస కూలీలను ఆదుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం వరకూ సోనూసూద్ సాయం నిరంతరంగా కొనసాగుతోంది. ఆయన చేస్తున్న సేవలు దేశం మొత్తానికి పరిమితం కావడం ఎందరినో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో కూడా ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి కూడా సోనూసూద్ చేస్తున్న సాయంపై స్పందించారు.

‘దేశానికి సోనూసూద్ లాంటి వ్యక్తి పీఎం కావాలి. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే నా ఓటు ఆయనకే’ అని అన్నారు. దీనిపై సోనూ స్పందించారు. ‘హ్యూమా నా గురించి ఇలా మాట్లాడటం ఆమె మంచితనం. ఇది ఒక గౌరవంగా భావిస్తాను. అయితే.. నేను అందుకు అర్హుడిని కాను. వయసు, అనుభవంలో నేను చాలా చిన్న వాడిని. నేనిప్పుడు చేస్తున్నవన్ని ఏదో ఆశించి చేయడం లేదు. నా సంతృప్తి కోసం చేస్తున్నాను. ప్రస్తుతానికి నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’ అని అన్నారు.