నీల్ – ఎన్టీఆర్.. అతను కూడా కలిస్తే బీభత్సమే..

మధ్యకాలంలో సౌత్ సినిమాలలో ప్రతినాయక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నారు. మన హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఉండటంతో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా తమ ఇమేజ్ పెంచుకోవడానికి సౌత్ చిత్రాలలో నటించడానికి మొగ్గు చూపిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలతో రెమ్యునరేషన్ కూడా భారీగా అందుతుండటంతో వారు పెద్దగా సంకోచించడం లేదు.

ఇక చేసే పాత్రలు పాజిటివ్, నెగిటివ్ అనే బేధాలు చూపడం లేదు. క్యారెక్టర్ లో కంటెంట్ ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ విలన్ గా నటించాడు. అతని పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. తరువాత లియో చిత్రంలో కూడా సంజయ్ దత్ నటించాడు. ఇప్పుడు తెలుగులో డబుల్ ఇస్మార్ట్ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

అలాగే యానిమల్ చిత్రంలో తన పెర్ఫార్మెన్స్ తో విలనీగా మెప్పించిన బాబీ డియోల్ సౌత్ లో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కుతోన్న కంగువ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు. హరిహరవీరమల్లు చిత్రంలో కూడా ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కోసం అతన్ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ వర్క్ టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. దేవర మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే డ్రాగన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీ డియోల్ ని సంప్రదిస్తున్నారంట. ప్రస్తుతం టీమ్ చర్చలు జరుపుతుందంట.

రెమ్యునరేషన్ మ్యాటర్ కొలిక్కి వస్తే మేగ్జిమమ్ ఫైనల్ అయినట్లే అని తెలుస్తోంది. ఈ చిత్రంలో తారక్ కి జోడీగా రష్మిక మందనని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తే మాత్రం కచ్చితంగా సినిమాకి మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. తారక్ ప్రస్తుతం దేవర మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దాంతో పాటు హిందీలో వార్ 2 కూడా చేస్తున్నారు. వార్ 2 ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ మూవీ అయితే హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఉంటుందనే మాట వినిపిస్తోంది.