మగధీర రీరిలీజ్ క్యాన్సల్ కు కారణం ఏంటంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈయన… తన రెండో సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొడతాడని ఏఎరూ ఊహించలేదు. కానీ చెర్రీ తన రెండో సినిమాతోనే సినీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇప్పటికీ అందులోని డైలాగ్ లు పాటలు అంటే అభిమానులకు ఇష్టమే. రాజమౌళి రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2009 జులై 31వ తేదీన విడుదలైంది.

అయితే ఇటీవలే ఈ చిత్రం రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేయాలనుకున్నారు. కానీ చెర్రీ నటించిన ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయడం లేదంటూ గీతా ఆర్ట్స్ అధికారిక ప్రకటన చేసింది. పలు సాంకేతిక సమస్యల కారణంగా ఈ చిత్రాన్ని చెర్రీ పుట్టిన రోజున రిలీజ్ చేయడం వెల్లడించింది. అంతేకాకుండా మరో మంచి సందర్భం చూసుకొని ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది.

మరోవైపు ఈ చిత్రానికి బదులుగా రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఆరెంజ్ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఆరెంజ్ సినిమాను మార్చి 27వ తేదీన రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించగా.. చెర్రీ బాబాయి మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఓ చిన్న పాత్రలో కూడా నటించారు. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

సినిమా కథ ఎక్కువ మందిని ఆకట్టుకోకపోయినా.. పాటలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మరి రెండోసారి రిలీజ్ అయి అయినా రామ్ చరణ్ అభిమానుల్ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. ప్రస్తుత జనరేషన్ కు ఈ స్టోరీ తగినదని అంతా భావిస్తున్నారు. మరి ఈసారి హిట్టవుతుందో ఫట్టవుతుందో చూడాలి. ఈ సినిమా రీరిలీజ్ చేయగా వచ్చిన డబ్బులు.. జనసేన పార్టీ ఫండ్ డ్రైవ్ కు అందజేస్తామని వెల్లడించారు.