అధికారులపైనే సీనియర్ ఐపీఎస్ ఫోర్జరీ ఆరోపణలు.. ఇదీ సంచలనమంటే.!

‘ఆయన మీద బోల్డన్ని ఆరోపణలున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి అని కూడా ఆలోచించకుండా అడ్డగోలుగా సస్పెండ్ చేసి పారేశారు. ఈ క్రమంలో కోర్టు నుంచి మొట్టికాయలూ తప్పలేదు. రకరకాలుగా ప్రయత్నిస్తూ ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం..’ ఇదీ ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో పోలీస్, రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.

అధికార పార్టీ మాత్రం, ‘చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగారు.. ఈ క్రమంలో అవినీతికి పాల్పడ్డారు.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారు..’ అని ఆరోపిస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. అయితే, అధికార పార్టీ తన మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనీ, కొందరు అధికారులు తనకు వ్యతిరేకంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ పోలీసు ఉన్నతాధికారులు సహా, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేయడమే కాదు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు.

ఫోర్జరీపై సీబీఐ విచారణ చేయించాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్. ప్రభుత్వం గనుక చర్యలు తీసుకోకపోతే, తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా అంటున్నారు ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వమే ఏబీ వెంకటేశ్వరరావుపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. అలాంటప్పుడు చీఫ్ సెక్రెటరీకి ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేస్తే ఫలితం ఏముంటుంది.?

నిజానికి ఇది చాలా కీలకమైన కేసుగా భావించాలేమో. మహారాష్ట్రలో ఓ అధికారి ఉదంతం అక్కడి హోంమంత్రి పదవి ఊడిపోయేలా చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఇరకాటంలో పడిపోయింది. అధికారులు ఫోర్జరీకి పాల్పడ్డారని ఏబీ వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆరోపించడమంటే, అది చిన్న విషయం కాదు. ఏ ఆధారాలూ లేకుండా ఆయన ఈ ఆరోపణలు చేశారని అనుకోలేం.