ఈ ఓటమి ముందు ఆ గెలుపు శుద్ధ దండగ.!

రాజకీయాల్లో ‘నైతికత’ అన్న మాటకు విలువ లేదు. గెలవడం కోసం ఏ గడ్డి తినడానికైనా రాజకీయ నాయకులు వెనుకాడరు. నాయకులు మాత్రం, గెలవడం కోసం గడ్డి తినడానికి సిద్ధపడరు. ఓటమిలో గెలుపు చూసేవాడే అసలు సిసలు నాయకుడు. ‘డబ్బులు పంచకుండా, ఇతరత్రా రూపాల్లో ఓటర్లను ప్రలోభపెట్టకుండా పది పాతిక ఓట్లు సాధించినా చాలు.. ఆ పది పాతిక మందిని నేను ప్రభావితం చేయగలిగాను..’ అని గర్వంగా చెప్పుకోగలిగేవాడే నిజమైన నాయకుడు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ ఓడిపోయారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నికల లెక్కింపులో, కమల్ చివరికి పరాజయం పాలయ్యారు. తొలుత కమల్ గెలిచినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, కమల్ ఓడిపోయారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నందిగ్రామ్ నుంచి ఇలాగే ఓడిపోయారు. మమత గెలిచినట్లుగా వార్తలొచ్చాయి.. కానీ, ఆమె ఓడిపోయారు. చూస్తోంటే, ఇదేదో 2019 ఎన్నికల్లో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలా అనిపిస్తోంది కదూ.?

ఔను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాగే జరిగింది. గాజువాకలో పవన్ గెలిచారన్న ప్రచారం జరిగింది. భీమవరంలోనూ పవన్ గెలుపుపై న్యూస్ ఛానళ్ళలో బ్రేకింగ్ న్యూసులు వచ్చాయి. కానీ, పవన్ ఓడిపోయారు. ఎందుకిలా.? కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది.? ఎక్కడో ఏదో లోపం వుంది. ఆ లోపం ఏంటి.? ఈ ప్రచారాల వెనుక అసలు కోణం ఏంటి.? ఏమోగానీ, మమతా బెనర్జీ, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్.. ఈ మూడూ దాదాపు ఒకేలా కనిపిస్తున్న ఉదాహరణలు.

మమతా బెనర్జీ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో వున్నారు కాబట్టి, ఆమె సంగతి పక్కన పెడదాం. కమల్, పవన్.. ఇద్దరికీ ఒకేలా ఎందుకు జరిగింది.? ఇద్దరూ పార్టీలు పెట్టి, రాజకీయాల్లోకి వచ్చి ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో అటు కమల్ గానీ, ఇటు పవన్ గానీ.. ఓటర్లను ప్రలోభపెట్టాలనుకోలేదు. అందుకే, ఓటమిని సైతం గెలుపుకంటే గర్వంగా భావించగలుగుతున్నారు.