ఈ శవాల దిబ్బ కనిపించట్లేదా విజయసాయిరెడ్డిగారూ.!

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రాజకీయం అత్యంత పతన స్థాయికి చేరింది. దిగజారిపోవడంలో అత్యంత లోతైన స్థాయిని చూస్తున్నాం రాజకీయంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. అయినాగానీ, ఇంకా ఇంకా లోతుల్ని వెతికేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. మరీ ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత బాధ్యతారాహిత్యంగా కనిపిస్తున్నాయి. ఆయనే ఆ ట్వీట్లు వేస్తున్నారా.? లేదంటే, ఆయన టీమ్ ఏదైనా ఈ పని చేస్తుందా.? అన్నది తేలాల్సి వుంది.

అయినాగానీ, మరీ ఇంత హేయంగానా.? ‘పుష్కరాల్లో షూటింగ్ చేసి శవాల దిబ్బను చూశాడు చంద్రబాబు.. బూటకపు ఎన్కౌంటర్లలతో శవాల గుట్టను చూశాడు. రైతులపై కాల్పులు జరిపించి రాక్షసానందం పొందాడు. శవాలను చూడ్డానికే రాజకీయ లబ్ది కోసం కరోనా కాలంలో ధర్నాలు, నిరసనలు, సినిమా ట్రిక్కులు, గులకరాయి రాజకీయం చేశాడీ మృత్యు బేహారి..’ అంటూ విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

చంద్రబాబు హయాంలోనో, మరొకరి హయాంలోనో.. ఒకసారో, రెండు సార్లో శవాల దిబ్బలు, గుట్టలు కనిపించాయేమో. కానీ, ప్రస్తుతం అనునిత్యం శవాల గుట్టల్ని చూస్తున్నాం.. శవాల దిబ్బల్ని చూస్తున్నాం.. సామూహిక అంత్యక్రియల్ని చూస్తున్నాం. ఇదంతా కరోనా మహమ్మారి కాలం. చరిత్రలో ఎన్నడూ చూడని మహమ్మారి ఇది. మరి, దీనికి విజయసాయిరెడ్డి ఏం సమాధానం చెబుతారు.?

చంద్రబాబు ఎలాంటి పొలిటికల్ స్టంట్లు ఎన్నికల నేపథ్యంలో చేశారో, అంతకు మించి వైసీపీ నేతలూ చేశారు. అది స్థానిక ఎన్నికల్లో కావొచ్చు, తిరుపతి ఉప ఎన్నికలో కావొచ్చు. ఎవరైనా తక్కువ తిన్నారా? ఎవరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించారా.? ప్రధానంగా వైసీపీ నేతల మీదనే కరోనా సూపర్ స్ప్రెడర్స్.. అన్న ఆరోపణలు వచ్చాయి. ఆ లెక్కన, కరోనా వ్యాప్తికి కారణమెవరు.?

ఎంపీ పదవిలో వున్న వ్యక్తుల నుంచి బాధ్యతాయుతమైన సమాచారాన్ని మాత్రమే ఆశిస్తారు ప్రజలు. విజయసాయిరెడ్డి, తన ట్విట్టర్ హ్యాండిల్ తన అదుపులో లేదని చెప్పగలిగితే మంచిదే. కానీ, తన ప్రమేయంతోనే ఆ ట్వీట్లు పడుతున్నాయంటే మాత్రం, అవి అస్సలేమాత్రం క్షమార్హం కాదు. రోజూ 70 నుంచి 80 ప్రాణాలు పోతున్న సమయంలో శవాల దిబ్బ, శవాల గుట్ట.. అంటూ పొలిటికల్ ట్వీట్లేయడం అత్యంత జుగుప్సాకరం, అత్యంత బాధ్యతారాహిత్యం.