ఆచార్యతో ఆదికేశవ పోలిక.. ఆయన ఏమన్నాడంటే!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమా అతి పెద్ద డిజాస్టర్‌ గా నిలిచింది. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుని తీరుతుందని భావించిన ప్రతి ఒక్కరు కూడా షాక్‌ అయ్యారు. అపజయం ఎరుగని కొరటాల శివ ఆ సినిమా తో బొక్క బోర్లా పడ్డాడు. మెగా కాంపౌండ్‌ కి దర్శకుడు కొరటాల శివ కి మధ్య గ్యాప్ కూడా ఆచార్య వల్ల పెరిగిందనే విషయం తెల్సిందే.

ఆచార్య సినిమాలో ఒక గుడిని, అలాగే ఒక జాతిని కాపాడటమే కథ. ఆ కథ విషయంలో దర్శకుడు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అనిపించింది. అందుకే సినిమా డిజాస్టర్‌ అయిందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఆచార్య గురించి ఎందుకు అంటే… చిరు మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా ఆదికేశవ అనే సినిమా రూపొంది విడుదలకు సిద్ధం అయిన విషయం తెల్సిందే.

ఆ సినిమా గ్లిమ్స్‌ ను విడుదల చేసిన సమయంలో భక్తి సినిమా అనిపించుకుంది, అంతే కాకుండా ఆచార్య కి కాస్త అటు ఇటుగా పోలిక ఉన్నట్లు అనిపిస్తోందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆచార్య కి ఆదికేశవ కి ఎక్కడ సంబంధం లేదని దర్శకుడు తేల్చి చెప్పాడు.

ఈ నెల 24న విడుదల కాబోతున్న ఆదికేశవ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా దర్శకుడు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఆదికేశవ సినిమా కథ లో శివుడి గురించి చాలా తక్కువ చూపించాం. కానీ కొందరు మాత్రం ఆచార్య తో పోల్చుతూ ఉన్నారు. అసలు ఈ సినిమా కథ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. దేవుడి కాన్సెప్ట్‌ అనేది పది నిమిషాలు ఉంటుందని దర్శకుడు పేర్కొన్నాడు.