‘అర్జున్ రెడ్డి’ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా అప్ కమింగ్ ఫిలిం ‘యానిమల్’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఈ సినిమా రన్ టైం సుమారు 200 నిమిషాలు ఉండడమే. అంటే దాదాపు ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు. ఇంత రన్ టైం తో సినిమా విడుదల చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉంటాయని చెబుతున్నారు.
ఇప్పటివరకు విడుదలైన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 7 పాటలు అంటే దాదాపు వాటికే 20 నుంచి 30 నిమిషాల టైం పడుతుంది. అయితే ఈ పాటలు మూవీ ప్లాట్ కి ఎంతవరకు హెల్ప్ చేస్తాయనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఈమధ్య పాటలు సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నాయి. అది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కానీ మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా కథకు తగ్గట్టు పాటలు ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
మూడు గంటల నిడివితో 8 పాటలు ఉండే సినిమాని ఆడియన్స్ చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ఒకప్పుడు సినిమాల్లో ఎనిమిది నుంచి పది పాటలు కూడా ఉండేవి. అవి కథాంశానికి తగ్గట్టుగా ఉండడంతో ప్రేక్షకులు ఆదరించారు. కానీ ఈ రోజుల్లో అలా కాదు. సినిమా నిడివి తక్కువ ఉండాలి, కంటెంట్ ఉండాలి, పాటలు సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేయొద్దు. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా వాటి పట్ల ఆడియన్స్ అసహనానికి గురవుతున్నారు.
అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి సినిమాల్లో రన్ టైం తో పాటు పాటలు కూడా ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరించారు. అందుకు కారణం ఆ రెండు సినిమాల్లో కథకు తగ్గట్లు పాటలు ఉంటాయి. ఇక తాజాగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ విషయంలోనూ సందీప్ వంగా ఇదే ఫార్ములాని రిపీట్ చేశాడు.
కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు ఈసారి తన గత చిత్రాల కంటే మరింత ఎక్కువగా రన్ టైం జోడించడంతో సందీప్ వంగా ఈ విషయంలో పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి గత సినిమాలకు వర్కౌట్ అయిన ఈ ఫార్ములా ‘యానిమల్’ కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.