రాజమౌళి.. కాస్త ఫ్యాన్స్ మాట వింటారా?

టాలీవుడ్ లో కొన్ని కాంబోల్లో సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటి కాంబోలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటైన సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతా. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే SSMB 29పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా స్టోరీ రెడీ చేశారని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. చాలా రోజులపాటు మూవీ స్టోరీ కోసం వర్క్ చేసినట్లు తెలిపారు. కథకు సంబంధించి చిన్న చిన్న హింట్స్ ఇచ్చారు. రీసెంట్ గా డైలాగ్ స్ర్కిప్ట్ ను కూడా పూర్తి చేశారని సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు.. కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు.

ఇప్పటికే లాంగ్ హెయిర్, గెడ్డంతో మహేష్ బాబు కనపడుతున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో మహేష్ ఇప్పటి వరకు ఎవరూ చూడని లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే SSMB 29 అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. దీంతో మహేష్ బాబు బర్త్ డే (ఆగస్టు 9) దగ్గర పడుతున్న వేళ… ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చి.. కీలక అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ ను కోరుతున్నారు. మెయిన్ కాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ వివరాలను అనౌన్స్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని అంటున్నారు. ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పోస్టులే కనిపిస్తున్నాయి.

హాలీవుడ్ రేంజ్ లో అత్యధిక బడ్జెట్ తో నారాయణ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విలన్ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ యాక్ట్ చేస్తారని సమాచారం. మరి మహేష్, జక్కన్న తమ సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో చూడాలి.