పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

హీరోయిన్ ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. బిడ్డను అపురూపంగా చూసుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేసింది. తామిద్దరం ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించింది ప్రణీత. “పాప పుట్టినప్పట్నుంచి అంతా కలగా ఉంది. గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండడం నిజంగా నా అదృష్టం” అంటూ తెలిపింది.

కరోనా టైమ్ లో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది ప్రణీత. వ్యాపారవేత్త నితిన్ రాజును, అతడి ఫామ్ హౌజ్ లోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న విషయం ప్రణీత ప్రకటించే వరకు ఎవ్వరికీ తెలియలేదు. కరోనా వల్ల ఆ తర్వాత రిసెప్షన్ కూడా పెట్టలేదు ఈ బ్యూటీ. అలా వైవాహిక బంధంలోకి ఎంటరైన ఈ చిన్నది, ఇప్పుడు తల్లి అయింది.

తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ప్రణీత. తెలుగులో ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించిన తర్వాత కూడా ఆమెకు క్రేజ్ రాలేదు. ఆ తర్వాత కన్నడ చిత్రపరిశ్రమకు పరిమితం అయిన ప్రణీత.. లాక్ డౌన్ టైమ్ లో ఛారిటీ కార్యక్రమాలతో పాపులర్ అయింది. అందరి మన్ననలు పొందింది. అదే టైమ్ లో పెళ్లి కూడా చేసుకుంది.

ఇకపై పాపే నా లోకం అంటోంది ప్రణీత. కొన్నాళ్ల పాటు పాపతో గడిపిన తర్వాత తిరిగి తన కెరీర్ ను కొనసాగించబోతోంది ఈ ముద్దుగుమ్మ. అన్నట్టు ఈమె బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది.