బిగ్‌బాస్‌ తెలుగు-5 : రవి గుంట నక్క, పంథం నీదా నాదా – ఎపిసోడ్ -10

ఎలిమినేషన్ నామినేషన్ కోసం ఎంపిక చేసిన రెండు టీమ్ లను పంథం నీదా నాదా అనే టాస్క్‌ ను నిర్వహించారు. కెప్టెన్సీ మరియు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ గా దీన్ని పరిగనిస్తున్నారు. ఈ టాస్క్ లో రెండు జట్లకు సంబంధించిన రెండు కలర్స్ లో చిన్న చిన్న పిల్లోస్ ను ఇవ్వడం జరిగింది. వాటిని వారి జట్టు సభ్యులు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆట ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి అనేది చూడాలి. టాస్క్ జరిగే సమయంలో ఆ పిల్లోస్ ను చింపేయవచ్చు.. ఏమైనా చేయవచ్చు. దాంతో ఇంటి సభ్యులు రచ్చ రచ్చ చేశారు. బిగ్‌ బాస్ ఆట ఒక విధంగా చెప్తే మరో విధంగా తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికి బిగ్‌ బాస్ పంథం నీదా నాదా టాస్క్ లో ఇంటి సభ్యులు చిన్నపాటి యుద్దమే చేశారు. చాలా సీరియస్ గా గేమ్‌ సాగుతోంది. ఒకరి మొహం ఒకరు చూడకుండా ఇష్టానుసారంగా దాడులకు దిగేస్తున్నారు. టాస్క్ ల్లో పులి మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తున్న వారి జోరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఆట మద్యలో లోబోకు తీవ్ర అస్వస్థత అవ్వడంతో వెంటనే డాక్టర్ రూమ్‌ కు తీసుకు వెళ్లడం జరిగింది. ఫిజికల్‌ టాస్క్‌ సమయంలో ఇలాంటివి జరగడం కామన్‌ అంటున్నారు. అయితే మొదట లోబో గేమ్‌ ఆడుతున్నారని కొందరు భావించారు. కాని ఆ తర్వాత లోబో నిజంగానే ఇబ్బంది పడుతున్నట్లుగా గ్రహించి వెంటనే డాక్టర్ రూమ్‌ కు తీసుకు వెళ్లడం జరిగింది. లోబో ను వారి జట్టు సభ్యులు చూసుకుంటున్న సమయంలో ప్రత్యర్థి జట్టు సభ్యులు గేమ్‌ ఆడుతున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఆట నీదా నాదా అన్నట్లుగా రెచ్చి పోయి మరీ ఆడుతున్నారు. ఆ క్రమంలో దెబ్బలు తలుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. దెబ్బలు తగిలితే డెటాల్‌ వేసుకుని.. చిన్న చిన్న గాయాలు అయితే పట్టించుకోకుండా ముందుకు దూకేస్తున్నారు. ప్రియాంక చేతికి కూడా చిన్న గాయం అయినట్లుగా తెలుస్తోంది. టాస్క్ లో ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టాస్క్‌ మంగళవారం ఎపిసోడ్‌ లో మద్యలో ఆగిపోయింది. ఆటాస్క్ బుదవారం ఎపిసోడ్‌ లో ముగిసే అవకాశం ఉంది.

ఇక టాస్క్‌ కాకుండా తాజా ఎపిసోడ్‌ లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం గుంట నక్క. క్రితం ఎపిసోడ్‌ లో నటరాజ్ మాస్టర్‌ ఎలిమినేషన్ నామినేషన్ సమయంలో మాట్లాడుతూ మేక రూపంలో ఒక గుంట నక్క ఇంట్లోకి వచ్చింది. అది కొందరిని ప్రభావితం చేసి నాపైకి ఉసి గొల్పే ప్రయత్నం చేస్తోంది. దాన్ని నేను ఎదుర్కొంటాను అంటూ సినిమా డైలాగులు చెప్పాడు. నామినేషన్ పక్రియ పూర్తి అయిన తర్వాత రవి వెళ్లి అలా ఎందుకు అంటున్నారు. నాతోనే మీరు సరిగా ఉండటం లేదు. నన్ను అలా ఎందుకు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించాడు. అందుకు నటరాజ్‌ మాస్టర్ నుండి స్పందన లేదు. ఆ తర్వాత సన్నీ వెళ్లి ఎవరు ఆ గుంట నక్క అంటూ ప్రశ్నించగా వచ్చింది కదా.. గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే బుజాలు తడుముకున్నట్లుగా అంటూ రవినే గుంట నక్క అంటూ తేల్చి చెప్పాడు. మొత్తానికి గుంట నక్క అంటూ రవిని అనడం వల్ల నటరాజ్ మాస్టర్ పై కాస్త వ్యతిరేకత మొదలు అయినట్లుగా కనిపిస్తుంది.