తెలంగాణలో ‘లాక్ డౌన్’.. నిజమేనా.? అసలు అవసరమా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొద్ది రోజుల క్రితమే లాక్ డౌన్ విషయమై పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమనీ, లాక్ డౌన్ అవసరం లేదనీ, లాక్ డౌన్ పెడితే.. రాష్ట్రానికి ఆర్థికంగా సమస్యలొస్తాయనీ, ప్రజలూ ఇబ్బందుల్లో పడతారనీ కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, ఒక్క రోజులోనే సీన్ మారిపోయింది. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోతున్నారంటూ ప్రచారం షురూ అయ్యింది.

అసలేం జరుగుతోంది.? రోజువారీ కేసుల సంఖ్య 5 వేలకు దిగువన వున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది.? ఇప్పుడు ఇదే తెలంగాణ సమాజం మదిలో మెదులుతున్న ప్రశ్న. ఓ దశలో తెలంగాణలో రోజువారీ కేసుల సంఖ్య 10వేలు దాటినప్పుడు కూడా లాక్ డౌన్ చర్చ జరగలేదు. అయితే, పొరుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న దరిమిలా, రాష్ట్రంలో లాక్ డౌన్ పెడితే, తెలంగాణకు కరోనా ప్రమాదం తగ్గుతుందనే భావనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నారనీ, ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ గురించిన చర్చ తెరపైకొచ్చిందనీ అంటున్నారు.

క్యాబినెట్ సమావేశం సందర్భంగా కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారట. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులతోపాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా రోగుల సంఖ్య ఎక్కువగా వుండడంతోనే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా.? అసలు ఈ లాక్ డౌన్ ప్రచారంలో నిజమెంత.? లాక్ డౌన్ వల్ల ఆర్థిక సమస్యలని చెప్పిన కేసీఆర్, ఇంతలోనే మనసు మార్చుకోవడం వెనుక అసలు కారణాలేంటి.?

కరోనా టెస్టులు తగ్గించేసి, కేసుల సంఖ్య తక్కువగా వుందని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని నమ్మించి వంచనకు గురిచేస్తోందా.? ఎన్నెన్నో ప్రశ్నలు.. వీటికి సమాధానాలు దొరకాలంటే, రేపు క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెదవి విప్పాల్సిందే. చూద్దాం.. కేసీఆర్ ఏం చెప్పబోతున్నారో.