కరోనా ఎఫెక్ట్: ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా..! ప్రకటించిన నిర్మాతలు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ రావు ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా వేగవంతం చేశారు. కరోనా కేసుల్లో పెరుగుదల చిత్ర యూనిట్ ను వెనకడుగు వేసేలా చేసాయి.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘దేశంతోపాటు తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. థియేటర్ల ఆక్యుపెన్సీ సైతం యాభై శాతానికి తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఉంది. అందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితుల చక్కబడ్డాక సినిమాను విడుదల చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టే ఆలోచన మాకు లేద’ని అన్నారు.