ప్రియాంక… ప్రియమైన శత్రువు….?

ప్రియాంక గాంధీ ఇపుడు బీజేపీకి చుక్కలు చూపించే పనిలో ఉన్నారు. ఆమె పంతం పౌరుషం అచ్చం నాన్నమ్మ ఇందిరాగాంధీ తరహాలోనే ఉండడం విశేషం. 1970 దశకంలో ఇందిర యంగ్ టర్క్ గా ఈ దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నేతల మీద ఎత్తులు పై ఎత్తులు వేసి చిత్తు చేశారు. ఆమె ఐరన్ లేడీగా నాడే గుర్తింపు తెచ్చుకున్నారు. మొండితనం దూకుడు ఇందిర సొంతం. ఇపుడు అవే తన ఆయుధాలుగా చేసుకుని ప్రియాంక కాంగ్రెస్ లో సరికొత్త అంకానికి శ్రీకారం చుడుతున్నారు. బీజేపీకి గుండె కాయ లాంటి ఉత్తరప్రదేశ్ లో తన సత్తా చాటుతూ కాషాయం పార్టీకి గుండె కోత పెడుతున్నారు.

దేశంలో రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ బలం వల్లనే అన్నది తెలిసిందే. ఎనభై లోక్ సభ సీట్లు కలిగిన యూపీ ఎవరి పక్కన ఉంటే వారు ప్రత్యర్ధులకు బీపీ తెప్పించడం ఖాయం. ఇపుడు యూపీలో కాంగ్రెస్ జాతకాన్ని తిరగరాయడానికి ప్రియాంక ఏకంగా అతి పెద్ద తపస్సే చేస్తున్నారు. యూపీని కాంగ్రెస్ చివరిసారిగా 1989లో పాలించింది. ఆ మీదట అంటే ఈ రోజుకు సరిగ్గా 32 ఏళ్ళు అవుతోంది పవర్ చేజారిపోయింది. ఇక గత కొన్ని ఎన్నికలు తీసుకుంటే కాంగ్రెస్ అతి పేలవమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది.

యూపీలో సమాజ్ వాదీ పార్టీ బీజేపీ బీఎస్పీల మధ్యనే ఎన్నికల సంగ్రామం అన్న స్థితి నుంచి కాంగ్రెస్ నుంచి కూడా తన వాటాను కోరుకునే దాకా తేవడం అంటే అది ప్రియాంక గొప్పతనమే అని చెప్పాలి. చాలా వ్యూహాత్మకంగా ప్రియాంక యూపీలో కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. జాతీయ పార్టీలకు తావు లేదు అనుకున్న చోట బీజేపీ నిలిచి గెలిచింది. ఇపుడు చూస్తే బీజేపీని ఢీ కొట్టే మరో జాతీయ పార్టీ తానేనని కాంగ్రెస్ వెనక నిలబడి ప్రియాంక గట్టిగానే చెబుతోంది.

ముల్లును ముల్లుతోనే కోయాలని సామెత. ప్రియాంక కూడా చేస్తున్నది అదే. ఫక్తు హిందూత్వానికి ప్రతినిధిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న బీజేపీకి గట్టి దెబ్బ తీసే పనిలో ప్రియాంక బిజీగా ఉంది. హిందూత్వలో తనకు సాటీ పోటీ లేదని ఆమె నుదుటన విభూది చెబుతోంది. వారణాసీలో విశ్వేశ్వరుడికి పూజలు చేసినా తాను పర్యటించే దారిలో ఉన్న గుడులూ గోపురాలూ సందర్శించినా ప్రియాంక స్టైలే వేరు. ఇక దసరా నవరాత్రులలో ఉపవాసాలు చేయడం ద్వారా ప్రియాంక తాను అచ్చమైన స్వచ్చమైన హిందువునే అని చాటి చెబుతున్నారు. నుదుటిన పసుపు రాసుకుని ఎర్రటి బొట్టు పెట్టుకుని ఆమె అపర దుర్గలా యూపీ సభల్లో మాట్లాడుతూంటే జనాలు ఒక్క లెక్కన పోటెత్తుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లో ఈ మధ్య జరిగిన లఖీం పూర్ ఖేరీ ఘటనను కూడా రాజకీయంగా వాడుకుంటూ రైతుల పక్షాన తామున్నట్లుగా ప్రియాంక సందేశం ఇచ్చింది. అంతే కాదు యూపీలో యోగీ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ ప్రజా సమస్యల మీద ఆమె గళమెత్తుతున్న తీరు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూపీలో ఇపుడున్న రాజకీయ ముఖ చిత్రం చూస్తే అఖిలేష్ యాదవ్ నాయకత్వాన ఎస్పీ మునుపటి మాదిరిగా పుంజుకోవడంలేదు ఇక బీఎస్పీ కూడా గత ఎన్నికల నుంచి పెద్దగా లేచి నిలబడింది లేదు. బీజేపీ అయిదేళ్ళ పాలన పట్ల జనాల్లో బాగా అసంతృప్తి ఉంది. దాంతో మరో పార్టీ కనుక ఉంటే ఆదరించేందుకు రెడీ అని ప్రజల నుంచి సంకేతాలు వస్తున్న వేళ కాంగ్రెస్ ని ముందు పెట్టి ప్రియాంక కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. యూపీలో ఈ రోజుకు చూస్తే కాంగ్రెస్ ఒక ఫోర్స్ కాకపోవచ్చు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ మాత్రం ఇంకా గట్టిగానే బలపడే అవకాశాలు అయితే కొట్టిపారేయలేరు. ఎవరితోనూ పొత్తులు లేవు మేము ఒంటరే అని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పిన మాటలు సవరించుకునెలా కాంగ్రెస్ దూకుడు సాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ ఎస్పీ పొత్తు కుదిరితే మాత్రం యూపీలో బీజేపీ ఇంటికే అన్న విశ్లేషణలు బలంగానే ఉన్నాయి.