#BB5 : ప్రియాంక తల్లిదండ్రుల ముచ్చటైన ముచ్చట్లు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రత్యేక కంటెస్టెంట్ గా ట్రాన్స్ జెండర్ అయిన ప్రియాంక సింగ్ వెళ్లిన విషయం తెల్సిందే. గత సీజన్ లో తమన్నా సింహాద్రి ట్రాన్స్ జెండర్ గా వెళ్లి నానా రచ్చ చేయడం జరిగింది. ఆమెతో పోల్చితే ప్రియాంక సింగ్ వంద శాతం బెటర్ అని.. ట్రాన్స్ జెండర్ లు అంటే ఉన్న చెడు అభిప్రాయం పోయే విధంగా ప్రియాంక సింగ్ నిలుస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అమ్మాయిల కంటే అందంగా ముస్తాబు అవ్వడం.. చాలా పద్దతిగా డ్రస్సింగ్ అవ్వడం అన్ని టాస్క్ ల్లో తన బెస్ట్ ఇవ్వడం.. ఇక ఇంట్లో వారికి వండి పెట్టడం ఇలా ప్రతి పనిలో కూడా ప్రియాంక ఉంటూ ప్రేక్షకుల మనసును దోచుకుంది. అలాగే కంటెస్టెంట్స్ కూడా ఆమెను ఎక్కువగా నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

బిగ్ బాస్ ఈ సీజన్ కు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రియాంక సింగ్ బర్త్ డే సందర్బంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు.. ఆ సమయంలో ఆమె ఎమోషన్స్ సీజన్ కే హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. గుడ్డి వాడు అయిన ప్రియాంక తండ్రికి తన కొడుకు ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తెలియదు. ఇన్నాళ్లు ఆ విషయాన్ని మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఆ విషయం తెలియడం.. తన తండ్రి ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనుకుంటూ ఉండగా నీవు ఎలా ఉన్నా మా కొడుకువే.. మా బిడ్డవే అంటూ అతడు మాట్లాడటంతో ప్రియాంక తో పాటు ఇంటి సభ్యులు అందరు మరియు ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అప్పటి నుండి ప్రియాంక తల్లిదండ్రుల గురించి మీడియాలో ఏదో ఒక కథనం వస్తూనే ఉంది.

తాజాగా ఒక మీడియా సంస్థ ప్రియాంక సింగ్ తల్లిదండ్రులను వారి ఊరికి వెళ్లి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సందర్బంగా ప్రియాంక తల్లి మాట్లాడుతూ మా వాడు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా టీ షర్ట్స్ మరియు జీన్స్ వేసుకునే వాడు. కాని అక్కడకు వెళ్లిన తర్వాత పూర్తిగా అమ్మాయిగా డ్రస్ లు వేసుకుంటున్నాడు. ఆ డ్రస్ ల్లో తేజూ చాలా అందంగా కనిపిస్తున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు బిగ్ బాస్ మేము చూడలేదు. కాని ఇప్పుడు మావాడి కోసం బిగ్ బాస్ చూస్తున్నాం. మా ఊరు వాళ్లంతా కూడా బిగ్ బాస్ ను చూస్తున్నారు. ఇక ప్రియాంక సింగ్ తండ్రి మాట్లాడుతూ.. నేను చూడలేను కాని నాగార్జున గారు నా పేరు పెట్టి పిలవడం.. నా తో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా మా తేజ్ సంతోషంగా ఉండాలి. వాడికి వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల ఆపరేషన్ చేయించుకుని ఉంటాడు. కనుక మేము ఆ విషయంలో క్షమించేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు.