విజయమ్మ బహిరంగ లేఖాస్త్రం.. అప్పుడెందుకు రాయలేదో మరి.?

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు, టీడీపీతోపాటు జనసేన చేస్తోన్న ఆరోపణలు.. వీటన్నటి నేపథ్యంలో విజయమ్మ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర్నుంచి, వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. వంటి అంశాలు విజయమ్మ రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావనకు వచ్చాయి. సీబీఐ, ఎన్ఐఏ వంటి విచారణ సంస్థల పరిధిలో వున్న అంశాల గురించి జగన్ మీద నిందలేయడమేంటి.? అన్నది విజయమ్మ ప్రశ్న.

రాజకీయంగా తనకు తెలంగాణ సరైనదని భావించి షర్మిల, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనుకున్న వైనం గురించీ విజయమ్మ పేర్కొన్నారు. వివేకా హత్య పేరుతో వైఎస్సార్ కుటుంబంలో చిచ్చపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వాపోయారు విజయమ్మ.

అసలు వైఎస్ జగన్ మీద హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి ఎందుకు వెళ్ళింది.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య కేసు విషయమై ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, కేంద్రానికి ఎందుకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయలేకపోతున్నారు.? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ ఎందుకు విచారణ చేయాల్సి వస్తోంది.? అన్న అంశాలపై విజయమ్మకు అవగాహన లేదా.? వుండీ ఆయా అంశాల్ని కావాలనే విస్మరిస్తూ బహిరంగ లేఖ రాశారా.? అనే చర్చ జరుగుతోందిప్పడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. అంటే, దాని వెనుక చాలా పెద్ద వ్యవహారం వుంది. వైఎస్ మరణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక. అలాంటప్పుడు, వైఎస్ మరణంపై అనుమానాలున్నాయని గతంలో నినదించిన విజయమ్మ, వైఎస్ జగన్.. ఆ తర్వాత ఆ విషయమై ఎందుకు ఎక్కడా గట్టిగా మాట్లాడలేకపోయారు.? కేవలం వైసీపీకి రాజకీయంగా మైలేజ్ వచ్చేందుకే హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారా.? అన్న ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు విజయమ్మ.?

ఇక, వివేకా హత్య కేసు విషయానికొస్తే.. రక్తపు మరకలు తుడిచేయబడింది కుటుంబ సభ్యుల సమక్షంలోనే. ఎందుకలా చేయాల్సి వచ్చింది.? ‘నా సోదరుడు ముఖ్యమంత్రి అయినా, నా తండ్రి హత్య కేసులో న్యాయం జరగడంలేదు..’ అని సునీత ఎందుకు వాపోయారు.? జనసేన అధినేత ప్రశ్నించారనో, టీడీపీ నిలదీసిందనో, టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండి వడ్డిస్తోందనో.. బహిరంగ లేఖ రాసిన విజయమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, వైఎస్ జగన్ మీద హత్యాయత్నం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. తదితర అంశాలపై ఇప్పటిదాకా ఎందుకు ఎక్కడా గళం విప్పలేకపోయారు.? ఏమో, ఆమెకే తెలియాలి.

అన్నట్టు, టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలపై గట్టిగా స్పందించిన షర్మిల, ఆ వెంటనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆమెకు రాజకీయంగా మద్దతు వుండదని వైసీపీ ప్రకటించినప్పుడు, షర్మిల ఎందుకు పెదవి విప్పలేదో ఏమో. ఇంతకీ, విజయమ్మకి కూడా షర్మిల లాగానే వైసీపీలో పదవులు దక్కలేదు. మరి, ఆమె సంగతేంటి.? ఆమె ఏ ఆలోచనతో బహిరంగ లేఖ విడుదల చేశారు.?