మంచు విష్ణు.. మంచి టైటిల్ వదిలేశాడే

మంచు ఫ్యామిలీలో ఎవ్వరికీ చాలా ఏళ్ల నుంచి కలిసి రావడం లేదు. ఆ ఫ్యామిలీలో మోహన్ బాబు లాంటి లెజండరీ యాక్టర్ అలాగే ఆయన తనయులు మంచు విష్ణు మంచు మనోజ్… తనయురాలు మంచు లక్ష్మీప్రసన్న.. ఇలా నలుగురు తారలున్నారు.

ఒకప్పటితో పోలిస్తే బాగా జోరు తగ్గించేసినప్పటికీ.. మోహన్ బాబు అప్పుడప్పుడూ లీడ్ రోల్స్లో సినిమాలు చేస్తున్నారు. విష్ణు మనోజ్ కూడా చాలా ఏళ్ల పాటు దండయాత్రలు చేశారు. లక్ష్మీ ప్రసన్న కూడా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. కానీ అందరికీ షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి.

గత ఐదేళ్లలో అయితే పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దీంతో అందరూ సినిమాలు తగ్గించేశారు. ఈ మధ్య మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే దారుణ పరాభవం ఎదురైంది.

ఇప్పుడిక విష్ణు తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాడు. ఈషాన్ సూర్య అనే కొత్త దర్శకుడితో సొంత బేనర్లో అతనో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘గాలి నాగేశ్వర్రావు’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు.

ఫన్నీగా అనిపిస్తున్న ఈ టైటిల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విష్ణు కూడా ఈ టైటిల్ను బాగానే ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు చూస్తే అది కాకుండా ‘జిన్నా’ అనే వివాదాస్పద టైటిల్ పెట్టారు.

మరి ‘గాలి నాగేశ్వర్రావు’ అనే క్యాచీ టైటిల్ ఎందుకు వదిలేశారన్నది అర్థం కావడం లేదు. లెజెడరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కించపరిచినట్లు ఉంటుందని పక్కన పెట్టారా.. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా.. లేదంటే ‘జిన్నా’ అనే కాంట్రవర్శల్ టైటిల్ ఉంటే ఇంకా పబ్లిసిటీ వస్తుందని అనుకున్నారా అన్నది తెలియదు మరి. సరే టైటిల్ సంగతెలా ఉన్నా ఈ సినిమాలో అయినా మంచి విషయం ఉండి విష్ణు సక్సెస్ దాహం తీరుతుందేమో చూడాలి.